NTV Telugu Site icon

Perni Nani: వైఎస్ఆర్ మరణించడంతోనే బందరు పోర్టు నిర్మాణం ఆలస్యం

Perni Nani

Perni Nani

Perni Nani: బందరు పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ అని.. 18 ఏళ్ళ నుంచి తమ కల సాకారం కాకపోవటం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంట్రాక్టర్‌ను జగన్ రద్దు చేశారని.. న్యాయపరమైన చిక్కుల వల్ల మరో రెండేళ్లు ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. రెండు, మూడు వారాల్లో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయనే నమ్మకంతో ఉన్నామన్నారు.

Read Also: Marriages Season: మొదలైన ముహూర్తాలు.. డిసెంబరులో ఎన్ని పెళ్లిళ్లు జరగనున్నాయంటే..?

బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఆమోదించిందని చెప్పారు. దక్షిణం, ఉత్తరం బ్రేక్ వాటర్ నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయన్నారు. డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1240 కోట్లు, టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452 కోట్లు కావాలన్నారు.

బందరు పోర్టులో మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం జరుగుతుందని.. మూడు బెర్తుల కోసం రూ.548 కోట్లు, బల్క్ కార్గో కోసం ఒక బెర్త్ .. దీనికి రూ.158 కోట్లు వ్యయం అవుతుందని పేర్ని నాని తెలిపారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80 వేల టన్నుల బరువుతో వచ్చే షిప్పులు రాగలుగుతాయన్నారు. లక్ష నుంచి లక్షన్నర బరువుతో ఉండే షిప్పులు వచ్చే బెర్తులను సెకెండ్ ఫేజ్‌లో నిర్మిస్తామన్నారు. రైల్, రోడ్డు నిర్మాణానికి 235 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా మూడు ఆర్వోబీలను నిర్మించాల్సి ఉంటుందని పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నం పోర్టును 30 మాసాల్లో పూర్తి చేసే విధంగా మెగా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ నెల 21న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన అని ఎంపీ బాలశౌరి ఎందుకు అన్నారో తనకు తెలియదన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం ఆమోదం లభించిందన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు కావడంతో ఆయన అలా ప్రకటించారేమో అని పేర్ని నాని సెటైర్ వేశారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని.. ఐదేళ్లు పాలన పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.