భారీవర్షా ల కారణంగా నెల్లూరు జిల్లా వాసులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. పెన్నానదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. దాదాపు 30 గ్రామాలు నీట మునిగాయి. నెల్లూరులోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. భగత్ సింగ్ కాలనీ, జనార్ధన్ రెడ్డి కాలనీ, జయలలిలతా నగర్, పొర్లుకట్ట, ఈద్గా కాలనీ, శివగిరి కాలనీ, మన్సూర్ నగర్, మనుమసిద్ది నగర్, పుట్టా ఎస్టేట్, తల్పగిరికాలనీలు నీట మునిగాయి.
వర్షాల వల్ల ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలు చీకట్లలో మగ్గుతున్నాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు పొంగడంతో, కలకత్తా – చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దామరమడుగు, సంగం ప్రాంతాల్లో ముంబాయి జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. విజయవాడ – చెన్నై, విజయవాడ – తిరుపతి మధ్య రైళ్లు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.