డేటా చౌర్యంపై అమరావతిలోని సచివాలయంలో హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించారని.. పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం ఉందని.. వాళ్లు సమాచారం దొంగిలించి కుట్ర చేశారని భూమన వ్యాఖ్యానించారు. కింది స్థాయి ఉద్యోగులు ఈ నేరం చేయలేదని.. 35 లక్షల నుంచి 40 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉందని భూమన విమర్శలు చేశారు. అయితే ఈ కుట్రను తాము అడ్డుకున్నామన్నారు.
Read Also: Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి
ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం పనిగట్టుకుని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తమను అధికారంలోకి రాకుండా చేయాలని కుట్ర చేసిందని పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన అన్నారు. డేటా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్లే అవకాశం లేదని అధికారులు విచారణలో స్పష్టం చేశారన్నారు. హోంశాఖ, ఐటీ శాఖ, పోలీస్ శాఖ అధికారులను విచారించామని.. సేవామిత్ర యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేసి ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని నిర్ణయించారన్నారు. 100 శాతం గత ప్రభుత్వంలో డేటా చౌర్యం జరిగిందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇది నేరమన్నారు. దీనిపై పోలీస్ దర్యాప్తు కూడా జరగాలని భూమన అభిప్రాయపడ్డారు. ఇది పెగాసస్‌పై విచారణ కాదని.. డేటా చౌర్యంపై విచారణ అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సీఎంకు, స్పీకర్ కు ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు.
టీడీపీ ప్రభుత్వం లక్షలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిందని ఎన్టీవీతో పెగాసెస్ కమిటీ సభ్యుడు అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. డేటా చౌర్యం భారీ కుట్ర అని.. హోం శాఖ, ఐటీ ఇతర శాఖల అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామని తెలిపారు. మరింత లోతుగా కమిటీ డేటా చౌర్యం ఎలా జరిగిందనే విషయాలను విశ్లేషిస్తోందని పేర్కొన్నారు. వచ్చే సమావేశానికి గతంలో డేటా విభాగంలో పని చేసిన అధికారులు, సిబ్బందిని పిలుస్తున్నామన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపై సిట్ వేసిందని.. ఆ నివేదికను ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో హౌజ్ కమిటీ నివేదిక సభ ముందు పెడుతుందని తెలిపారు.