Peddireddy Ramachandra Reddy Focus On Group Politics: చంద్రబాబుకు, సీఎం జగన్‌కు మధ్య నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి పార్టీ కోసం పని చేసేలా అందరినీ కలుపుకుని వెళ్ళాలని.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా అందరూ కష్టపడాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రతి జిల్లాకు ఒక రీజనల్ కోఆర్డినేటర్, ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడును నియమించారన్నారు. పరిపాలన మన ఇంటి ముంగిటకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి 14కు 14 సీట్లు వైసీపీ కేవసం చేసుకునేలా అందరూ కృషి చేద్దామని అన్నారు.
కాగా.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలోని పలు అసెంబ్లీ నియోజకవర్గా్ల్లో నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం.. ఆ విభేదాల్ని చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగి, నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. గ్రూప్ పాలిటిక్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటి వాటిని సహించేది లేదని, నాయకులపై అసమ్మతి లేని నియోజకవర్గం ఉండదని, అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. విభేదాల్ని పక్కన పెట్టి.. అందరూ కలిసి పని చేయాలని కోరారు.
ఇదే సమయంలో.. శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, చౌలురు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ నేతలతో సమావేశం కానున్నారు. వారి మధ్య విభేదాల్ని సామరస్యంగా పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. అనంతరం డిసెంబర్ 17వ తేదీన పెనుకొండ, ధర్మవరంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 18న పుట్టపర్తి, కదిరిలో పెద్దిరెడ్డి పర్యటించనున్నారు.