Site icon NTV Telugu

Payyavula Keshav: నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది

Payyavula Keshav

Payyavula Keshav

నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అసలు కోర్టులో దొంగలు ఎందుకు పడ్డారు.. దేని కోసం ఈ దొంగతనం జరిగిందో చూడాలన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఏ1గా ఉన్న కేసులో డాక్యుమెంట్లు చోరీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కోర్టులో దొంగతనం అనేది దేశంలో ఇప్పటి వరకు జరగలేదని.. ఇదే తొలిసారి అని పయ్యావుల ఆరోపించారు.

కోర్టులో డాక్యుమెంట్లు లేకపోతే కోర్టు తీర్పు ఇవ్వలేదనే ఆలోచన చేసి ఈ చోరీకి పాల్పడినట్లు కనిపిస్తోందని పయ్యావుల ఆరోపించారు. కోర్టులో డాక్యుమెంట్లు దొంగలించడమనేది న్యాయ వ్యవస్థను, కేసును ప్రభావితం చేయడంగా పరిగణించాలన్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కాకాని సహా, ఏ2, ఏ3లు బెయిళ్లను రద్దు చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. కేసులో ఆధారాలుగా ఉన్న ఫోన్లు, ఇతర నివేదికలు మాయమైనట్లు తెలుస్తోందన్నారు.

గతంలో కొలంబియాలో బాబ్లో ఎస్కో బార్ అనే కరుడుగట్టిన మాఫియా డాన్ మాత్రమే ఇప్పటి వరకు కోర్టుపై దాడి చేశారని.. ఇప్పుడు నెల్లూరు కోర్టులో చోరీ ఘటన కొలంబియాలోని బాబ్లో ఎస్కో బార్ ఘటనను గుర్తు చేస్తుందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కోర్టులో దొంగతనం ఘటనను కోర్టు సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టాలని పయ్యావుల కోరారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని తాము నమ్ముతున్నట్లు పయ్యావుల తెలిపారు.

Ambati Rambabu: చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది

Exit mobile version