Site icon NTV Telugu

Pawan Kalyan: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. ఎందుకు స్పందించట్లేదు?

Pawan Kalyan To Ap People

Pawan Kalyan To Ap People

Pawan Kalyan Wishes AP State Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్.. ప్రజలంతా నిత్య చైతన్యమూర్తులై పోరాడాలని స్పూర్తినింపారు. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం పొట్టి శ్రీరాముల ప్రాణార్పణతో ఈ రాష్ట్రం అవతరించిందని అన్నారు. ఆంధ్రుల్లో ఎలాంటి చైతన్యం కోసం ఆ అమరజీవి తపించారో.. ఇప్పుడు ఆ చైతన్యం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా.. ప్రజల్లో ఎందుకు స్పందన కరవైందని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారని అడిగారు. పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా.. ఎందుకు ప్రశ్నించడం లేదు? అని మండిపడ్డారు.

ఏ లక్ష్యం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ అవతరించిందో ఒక్కసారి మననం చేసుకోవాలని ప్రజలకు పవన్ మనవి చేసుకున్నారు. అక్రమార్కులు పాలన చేస్తుంటే.. చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని అన్నారు. ఏపీ అవతరించిన పర్వదినాన.. బాధ్యతాయుతమైన పౌరులందరు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. శాంతి సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేలా.. కార్యాచరణతో ముందుకు సాగాలి, గళమెత్తాలని పిలుపునిచ్చారు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలపాలంటే.. ఓటును ఆయుధంగా మలచుకోవాలని సూచించారు. కాగా.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాటం చేయడంతో.. తొలుత ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయి, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా, ఆ తర్వాత 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీన్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే.. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించగా.. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించి, కొత్త రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే!

Exit mobile version