NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రతి కుటుంబం వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన తరపున చేనేత కళాకారులకు కళాభివందనాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చేనేత కోసం జాతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళను నమ్మిన వారు అర్ధాకలితో జీవిస్తుండటం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెరవక కొందరు చేనేత కళను సజీవంగా నిలుపుతున్నారని కొనియాడారు. కళారంగంపై లోతైన అధ్యయనం జరగాలని, కళాకారులకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండాలన్నారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు కలిగే నిడారంబరత, ప్రశాంతత, లాలిత్యం మనసును హత్తుకుంటుందన్నారు.

Read Also: Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్.. మంత్రికి స్పెషల్ ట్వీట్

భారతీయ కళలు ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో జగమంతా తెలుసన్నారు. అటువంటి కళల్లో వారసత్వంగా చేనేత కళారంగం విరాజిల్లుతున్నదని.. మన చేనేత కళారంగం ఎంతో సృజనాత్మకమైనదని పవన్ అన్నారు. అటువంటి చేనేత కోసం నేడు జాతీయ దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. మన దేశ స్వతంత్ర సంగ్రామంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని పవన్ పేర్కొన్నారు. చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడే దాకా ప్రత్యక్షంగా ప్రభుత్వం, పరోక్షంగా ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి గొప్ప సుగుణాలున్న చేనేతకు తన జీవితాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడతానని పునరుద్ఘాటిస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత కళాకారులు ఆర్ధిక పుష్టి ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు.