NTV Telugu Site icon

Janasena: కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఫిక్స్

Pawan Kalyan Min

Pawan Kalyan Min

రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శిరివెళ్లలో ఓ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. ఇదివరకే అన్నదాతకు అండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రైతు భరోసా యాత్ర సమయంలోనూ పవన్ పలువురు రైతులకు ఆర్థికసాయం అందించారు. 41 మంది రైతులకు రూ. 1 లక్ష చెక్‌లను ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కర్నూలు జిల్లా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

రాష్ట్రంలో అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే అని, సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ళలో బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ రైతు కుటుంబాలకి అందాల్సిన సాయం అందలేదని చెప్పిన నాదెండ్ల.. తొలి విడతలో భాగంగా 130 మంది కౌలు రైతులకు పవన్ సాయం చేయనున్నారని తెలిపారు. రెండో విడతలో మిగిలిన వారికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పవన్‌పై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మాని, రైతులకు సాయం అందించే పనిపై దృష్టి పెట్టమని ఆయన సూచించారు.

పవన్ కళ్యాణ్ ఈ రైతు భరోసా యాత్ర చేపట్టగానే.. ఆదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం రూ.లక్ష వేస్తోందని అన్నారు. నిజానికి.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వారికి రూ. 7 లక్షల సాయం అందాలని, ఆ డబ్బులు వారికి అందజేయాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. రైతు భరోసా యాత్రం రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గ్రహించే.. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారన్నారు. రైతులకు అందాల్సిన పూర్తి సాయం అందేవరకూ.. జనసేన పోరాటం ఆగదని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.

రైతుల ఆత్మహత్యలపై రాజకీయం చేయడం మాని.. అన్నదాతలకు ఎలా అండగా నిలవాలో, వారికి ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలన్న విషయంపై ఆలోచిస్తే మేలని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారిని సూచించారు. సాగు నష్టాలు, రుణ భారంలో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని అన్నారు. ఇందుకు రైతుల ఆత్మహత్యలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడే స్థితికి వచ్చారంటే, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విషయం అర్థమవుతోందన్నారు.