Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!

  • పోలవరం అడవుల్లో పులి కలకలం.. పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష
  • డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలపై నిఘా
  • ‘హనుమాన్ టీమ్‌లు’ రంగంలోకి.. గ్రామాల్లో హై అలర్ట్
  • పశువులు కోల్పోయిన రైతులకు పూర్తి పరిహారం హామీ
Pawan Latest Look

Pawan Latest Look

Pawan Kalyan : పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం జిల్లా సమీప అడవులతో పాటు ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయిలో అటవీ శాఖ ఉన్నతాధికారులు స్వయంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

పులి కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, ట్రాప్ కెమెరాల వంటి అత్యాధునిక సాంకేతికతను (Advanced Technology) ఉపయోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో నిరంతరం అప్రమత్తత ప్రకటించాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. పులిని పసిగట్టేందుకు , అడవి వైపు వెళ్లకుండా నిలువరించేందుకు ‘హనుమాన్ బృందాలను’ (Hanuman Teams) పూర్తి స్థాయిలో రంగంలోకి దించి 24 గంటల పాటు నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు హనుమాన్ టీమ్‌లను కూడా వినియోగించుకోవాలన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF) స్వయంగా పర్యవేక్షించాలని, అవసరమైతే ఒక సీనియర్ అధికారిని తక్షణమే ఘటనా స్థలానికి పంపాలని స్పష్టం చేశారు.

×
×
Ad

పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని గ్రామ ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే రైతులు తమ పశువులను అటవీ ప్రాంతానికి సమీపంలో కట్టేయవద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు గ్రామస్తులతో ఎంతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారిలో భయాందోళనలు తొలగించాలని చెప్పారు. పులి దాడిలో పశువులను కోల్పోయిన బాధిత రైతులకు ఇప్పటికే ప్రాథమిక పరిహారాన్ని అందజేశామని, వెటర్నరీ (పశువైద్య) శాఖ నుంచి పూర్తి నివేదిక అందిన వెంటనే మిగిలిన పూర్తి పరిహారాన్ని కూడా త్వరితగతిన అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.