NTV Telugu Site icon

Pawan Vizianagaram Tour: విజయనగరం బయలుదేరిన పవన్… ఫ్యాన్స్ హంగామా

Pawanl1

Pawanl1

విశాఖ నోవాటెల్ నుంచి విజయనగరం బయలుదేరారు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పవన్ విజయనగరం వెళుతున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు విశాఖలోని పవన్ బస చేసిన హోటల్ కి చేరుకుని నినాదాలు చేశారు. ఇవాళ విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి రోడు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్…

నోవాటల్ నుండి విజయనగరం రోడ్డు మార్గాన బయలుదేరారు. భీమిలి జాతీయ రహదారిపై స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్. వై జంక్షన్ నుంచి ర్యాలీగా గుంకలాం చేరుకుంటారు పవన్ కళ్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టింది.

#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహనిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్టింది. గుంకలాంలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించి పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారని జనసేన పార్టీ గుర్తుచేసింది. దీంతో సీఎం శంకుస్థాపన చేసిన గుంకలాం గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. పవన్ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తున్నా… వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని జనసేన పార్టీ పేర్కొంది.