Pawan Kalyan comments on Flood Victims Difficulties: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడంతో బాధ్యత తీరిపోదని.. మానవత్వంతో స్పందించాలని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలలో వందల గ్రామాల ప్రజలు నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారని.. వేలమంది బాధితులు ఉన్నా నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తే వైసీపీ ప్రభుత్వం వరద పరిస్థితులపై ఏ మాత్రం అప్రమత్తంగా లేదని అర్ధమవుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Read Also: Andhra Pradesh Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. కేంద్రం మరోసారి స్పష్టీకరణ
వరద బాధితులను ఆదుకోమని తాము కోరుతుంటే.. రాజకీయం చేస్తున్నామని విమర్శలు చేస్తున్నామని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వైఫల్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు కనీసం పడవలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని పవన్ విమర్శించారు. అన్నపూర్ణ లాంటి కోనసీమలో ఆహారం కోసం పెనుగులాడే పరిస్థితి కల్పించారన్నారు. జనసైనికులు ఇప్పటికీ ముంపు గ్రామాల్లో పని చేస్తున్నారని.. బాధితులు ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారని పవన్ తెలిపారు. జనసైనికుల సేవలు అభినందనీయమని ప్రశంసించారు.