జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి అత్యంత కీలకమైన, భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. కుల రాజకీయాల నుండి పొత్తుల వరకు, సనాతన ధర్మం నుండి దేశ ప్రయోజనాల వరకు అనేక అంశాలపై ఆయన తన మనసులో మాటను కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తుపై , క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తన్ను ఒక కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్న వారిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. “నేను ఒక కులంలో పుట్టాను, దానికి నేనేం చేస్తాను? కానీ నేను కేవలం కాపుల కోసమే పని చేయడానికి రాలేదు, అన్ని కులాల కోసం వచ్చాను” అని స్పష్టం చేశారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా ప్రస్తావన తెస్తూ.. “ఆయన తనకు ప్రాణహాని ఉందని మొత్తుకున్నప్పుడు, ఈరోజు మాట్లాడే మేధావులు, నాయకులు అప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఆయనకు రక్షణ ఇవ్వలేకపోయిన వారే ఇప్పుడు మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. కాపులంతా తనకే ఓటు వేసి ఉంటే 2019లో భీమవరం, గాజువాకలో ఎందుకు ఓడిపోతానని ప్రశ్నించారు.
టీడీపీతో పొత్తు గురించి వస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. “2024లో టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుండేదని నా చెవిలో ఊదరగొడుతున్నారు. కానీ ఆరోజు పరిస్థితులు వేరు. ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయ్యేది. చంద్రబాబు ని జైలులో కలిసినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని తెలిపారు. పొత్తు వల్ల మెజారిటీ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, అన్నీ గమనిస్తున్నానని చెప్పారు. “నేను ఎవరికైనా మద్దతు ఇస్తే త్రికరణ శుద్ధిగా ఇస్తాను, అవతలి నుండి కూడా అదే ఆశిస్తాను. మీ ఆత్మగౌరవం దెబ్బతింటే నేను చూస్తూ ఊరుకోను” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి విజయం సాధిస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న పోలికలకు ఆయన సమాధానమిచ్చారు. “విజయ్ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అక్కడ ఎవరో గెలిస్తే ఇక్కడ నన్ను చంపేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అలాగే సనాతన ధర్మంపై దాడి చేసే వారిని విమర్శిస్తూ.. వేల ఏళ్ల చరిత్ర ఉన్న సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంత సులభం కాదని, ఓట్లు పోతాయనే భయంతోనే ఎన్నికల ముందు ఈ మాటలు మాట్లాడలేదని ధ్వజమెత్తారు.
సెప్టెంబర్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, రేపటి నుండి స్వయంగా పార్టీ కార్యాలయంలో కూర్చుని కమిటీల ఎంపికను పర్యవేక్షిస్తానని చెప్పారు. నెల రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని జనసైనికులకు హామీ ఇచ్చారు.
దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను పవన్ కళ్యాణ్ సమర్థించారు. ఇంధనం (పెట్రోల్) వాడకాన్ని తగ్గించాలని, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పొదుపు సూచనలు పాటించాలని కోరారు.
