NTV Telugu Site icon

Pawan Kalyan: పర్యావరణంపై ప్రభుత్వానికి ఇప్పుడే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో ఇప్పటికిప్పుడు సడెన్‌గా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తప్పుబట్టారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యం, విషవాయువు లికేజీ లాంటి అంశాల్లో మందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యులైనవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, రిషికొండను ధ్వంసం చేసినా పట్టించుకోలేదని.. సడెన్‌గా పర్యావరణంపై ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఈ అంశంపై రెండు రోజుల క్రితం పవన్ వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది కాబట్టి.. కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలని పవన్ హితవు పలికారు.

అటు అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని వెదజల్లే పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చిందని..అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో.. లేదో అంటూ చురకలు అంటించారు.

మరోవైపు సేవ్ రుషికొండ పేరిట సోమవారం నాడు విశాఖలోని రుషికొండ, బీచ్ ప్రాంతాల్లో జనసేన భీమిలి ఇంఛార్జి సందీప్ పంచకర్ల అవగాహన ర్యాలీ చేపట్టగా.. పలువురు జనసేన పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.