Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?

Tdp

Tdp

పార్టీ ఏదైనా… ప్రజాప్రతినిధుల అవినీతి అన్నది సర్వ సాధారణమైపోయింది. ఇక పవర్‌లో ఉంటే… చెప్పేపనేలేదు. కానీ…. ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం అవినీతే కాదు….అంతకు మించి అంటున్నారా? దేన్నీ వదలకుండా… ఎక్కడ రూపాయి కనపడితే… అక్కడ వాలిపోతున్నారా? మళ్లీ ఛాన్స్‌ వస్తుందో లేదో అన్నట్టు ఆబగా అందినకాడికి దోచేస్తున్నారా? వాళ్ళకు సీఎం చంద్రబాబు డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చారా? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా అవినీతి కథలు? 2024 ఎన్నికల్లో గుంటూరు జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది కూటమి. పైగా… చాలామంది ఎమ్మెల్యేలకు మంచి మెజార్టీలు వచ్చాయి. రాజధాని అమరావతి కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉండటంతో ఇక్కడి ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యం పెరిగింది. వీళ్ళ కదలికలపై పెద్ద ఫోకస్‌ కూడా ఉంటోంది. అయినా సరే… కొంత మంది శాసనసభ్యుల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. వాళ్ళ మీద సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా గ్రూపు విబేధాలు, మట్టి, రేషన్, మైనింగ్ మాఫియాలు… ఇలా చాలా వ్యవహారాల్లో కొన్ని పేర్లు నానుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మేం అంతకు మించి అన్నట్టుగా ఉంటున్నారట. ఇప్పుడు ఆ ఇద్దరి గురించే గుంటూరు టీడీపీలో తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మీద పార్టీ అధిష్టానానికి విపరీతంగా ఫిర్యాదులు వచ్చాయట. కొత్తగా గెలిచిన సదరు శాసనసభ్యుల తీరుతో… సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు బాగా ఇబ్బంది పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వాళ్ళిద్దరిలో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయట. ఆ విషయంలోనే కొంతమంది పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేలా ఉందని టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు చేస్తున్న అక్రమాలు సొంత పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తున్నాయంటున్నారు. అందుకే ఆశాసనసభ్యుడి తీరుపై పార్టీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ఇక మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే అంతా తామై నడిపిస్తున్నారట. జరుగుతున్న అక్రమాలపై సార్‌ అస్సలు దృష్టిపెట్టడంలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే సొంత మనుషుల అనుమతి ఉండాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందేనని మాట్లాడుకుంటున్నారు. పైకి నాదేముందని చెబుతున్నా….నాకు తెలియకుండా చీమ చిటుక్కుమనడానికి వీల్లేదని పరోక్షంగా ఆర్డరేశారట. ఎన్నోఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ గెలిచిందన్న సంతోషం ఒకవైపు, ఎమ్మెల్యే కనీస విలువ ఇవ్వడంలేదన్న బాధ మరోవైపు లోకల్‌ టీడీపీ లీడర్స్‌, కేడర్‌ని బాధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించినప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ప్రత్యేక ప్రస్తావన వచ్చిందట.

 

దాంతో… చంద్రబాబు ఆ ఇద్దరి మీద సీరియస్‌ అయినట్టు సమాచారం. పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాల్సింది పోయి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా…? దీన్ని సహించేది లేదని హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజాప్రతినిధులుగా భవిష్యత్తులో కొనసాగాలంటే తీరు మార్చుకోవాల్సిందేనని ముఖం మీదే అన్నట్టు సమాచారం. మీరు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో … డేటా మొత్తం నా దగ్గరుంది. మీ పనితీరు వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని కూడా నిర్మొహమాటంగా అన్నట్టు తెలిసింది. మరోసారి సమీక్ష నిర్వహించే వరకూ మీ పనితీరు చూస్తానని, మారకుంటే చేయాల్సింది చేస్తానని కూడా వార్నింగ్‌ ఇచ్చారట చంద్రబాబు. పార్టీ అధినేత మాటలతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు షాకైనట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి డైరెక్ట్‌గా ఆ ఇద్దర్నే హెచ్చరించినా… ఆ దెబ్బకు జిల్లాలోని మిగతా శాసనసభ్యులు కూడా అలర్ట్‌ అయ్యారట. దీని గురించే ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో తెగ మాట్లాడేసుకుంటున్నారు.