అక్కడ టీడీపీ నాయకులు రాజుగారి గంగాళంలో ఊరి జనమంతా పాలు పోసిన కథను గుర్తుకు తెచ్చారా? అధికారంలో ఉన్న పార్టీ మీటింగ్ పెడితే…. కళకళలాడాల్సిన వేదిక ఎందుకు వెలవెలబోయింది? పైగా విజయోత్సవ కార్యక్రమంలో సొంత కార్యకర్తలే ఎందుకు ఉత్సాహంగా పాల్గొనలేదు? ఏ జిల్లాలో జరిగిందా వ్యవహారం? దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి?
ఏపీ రాజధాని అమరావతి ఉన్న జిల్లా గుంటూరు. 2024 ఎన్నికల్లో ఇక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటు కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. దాంతో…. ఈ విభజిత జిల్లాలో తిరుగులేదని భావించాయి పార్టీ వర్గాలు. బయట పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా అదే అభిప్రాయం ఉంది. కానీ…. తాజా పరిణాలను చూస్తుంటే… ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుందేమోనన్న సందేహం కలుగుతోందట చాలా మందికి. ఆ సందేహాలను కూడా తెలుగుదేశం వర్గాలే రేపాయని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే….. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సుపరిపాలనకు రెండేళ్లు పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో పల్నాడుజిల్లా, బాపట్ల జిల్లాల్లో జరిగిన సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. జిల్లా స్థాయి సమావేశం కార్యకర్తలు, పార్టీ అభిమానులు లేక వెలవెలబోయింది. దాంతో టీడీపీ పెద్దలు కూడా షాకయ్యారట. కీలకమైన జిల్లాలో ఇదేంటంటూ ఆరాతీసి విస్తుపోయినట్టు సమాచారం. అలా విఫలం అవడానికి పెద్ద కారణమే ఉందని ప్రచారం జరుగుతోంది. సభ నిర్వహించాలని పార్టీ ఆదేశించినప్పుడు జిల్లాలో ఉన్న నేతలందరూ కూర్చుని మాట్లాడుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడం కామన్. విజయవంతం చేసేందుకు నియోజకవర్గాలనుంచి జన సమీకరణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం అదేమీ జరగలేదు. జిల్లా కమిటీ ఉన్నా, సభ నిర్వహణ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. నాయకులు కూర్చొని మాట్లాడుకోలేదు. కేవలం ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నామని మాత్రమే ప్రకటించారు. తర్వాత నేతలు కూడా వారి గ్రూపుల్లో విజయోత్సవసభ జరుగుతుందని కార్యకర్తలకు సమాచారం ఇచ్చి వదిలేశారు. అలా వదిలేయడానికి కూడా కారణం ఉందని అంటున్నారు. కార్యకర్తలను సభకు తరలించాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. దాంతో… ఇదంతా మనకెందుకొచ్చిన తంటా…. జిల్లాలో అందరూ మన పార్టీ ఎమ్మెల్యేలేకదా…! మిగతా నియోజకవర్గాలనుంచి కార్యకర్తలు వచ్చినా నిండుగానే కనిపిస్తుంది ఆ మాత్రం దానికి మన చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకున్నారట ఎక్కువ మంది. ఆ క్రమంలోనే… తీరా వేదిక దగ్గరికి వచ్చేసరికి భారీ ఏర్పాట్లు చేసినా… అందుకు తగ్గస్థాయిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం రాలేదు. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే… విజయోత్సవ సభ వెలవెలబోయిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం నేతల మద్య సమన్వయలోపమేనని చెప్పుకుంటున్నారు.
జిల్లా అధ్యక్షుడు ముందుగా అందరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడి విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పార్టీ మండలాధ్యక్షులతో అయినా సమావేశం ఏర్పాటు చేసి సభ విజయంతానికి ఏం చెయ్యాలన్నదానిపై కూడా దృష్టి పెట్టలేదు. అందరూ సీనియర్ నేతలే కదా… పైగా పార్టీ అధికారంలో ఉంది… ఖచ్చితంగా కార్యకర్తలు భారీగా తరలివస్తారని ఎవరికి వాళ్ళు లెక్కలేసుకున్నారట. ఫైనల్‌గా ఎవరి లెక్కలు వాళ్ళ దగ్గరే మిగిలిపోగా…. పార్టీ కార్యకర్తలు ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే…. రాజుగారి గంగాళంలో ఊరందరూ తీసుకొచ్చి పాలు పోసిన కథ గుర్తుకు వస్తోందని టీడీపీ నేతలే చమత్కరించుకుంటున్న పరిస్థితి. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రి…. ఇలా నేతలైతే హాజరయ్యారుగానీ…. కార్యకర్తలు మాత్రం పెద్ద షాకిచ్చారు. మరోవైపు జిల్లాలో కొంతమంది నేతల మధ్య విబేధాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే సభ నిర్వహణ గురించి ముందుగా మాట్లాడుకోలేదన్నది ఇంటర్నల్‌గా వినిపిస్తున్న మాట. కీలకమైన మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇక పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర సీనియర్ కావడంతో సభకు కార్యకర్తలను తీసుకురావాలని చెప్పే పరిస్థితి లేదు.
తెనాలిది కూడా దాదాపుగాఇదే పరిస్థితి. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరి దారి వారిదే. దాంతో ముందుగా అందరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకుండాపోయిందని అంటున్నారు. అదే సమయంలో పనులకోసం ఎమ్మెల్యేల దగ్గరికి వెళితే సరిగా స్పందించడం లేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో బాగా పేరుకుపోయిందట. అలాంటప్పుడు పిలవని పేరంటానికి మనం వెళ్ళడం ఎందుకనుకుంటూ ఎవరికి వాళ్ళు ఈ మీటింగ్‌ను లైట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇది చిన్న మీటింగ్‌కే పరిమితమైనా…. కచ్చితంగా జిల్లాలో పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని, మారకుంటే మొత్తానికే తేడా కొడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

