టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. పార్టీలో కుమ్మక్కు రాజకీయం జరుగుతోందా..? అనేదే టీడీపీ సర్కిల్సులో తాజా హాట్ టాపిక్. చాలా కాలంగా టీడీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడండి.. స్థానిక ఎమ్మెల్యేలు చేసే అవినీతి అక్రమాలు తదితర అంశాలపై ఫోకస్ పెట్టండని ఆదేశిస్తోంది. కానీ ఈ మాటను మెజారిటీ ఇన్ఛార్జులెవ్వరూ లక్ష్య పెట్టడం లేదట. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యాలయానికి రావడం ఓ ఫొటో దిగడం.. వాటిని పార్టీ కార్యాలయానికి పంపుకొంటూ చేతులు దులిపేసుకుంటున్నారట. దీంతో పార్టీపరంగా ఎంత చేస్తున్నా.. ఫీల్డులో ఆ రిజల్ట్స్ కన్పించడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.
Read Also: Off The Record about Asifabad MLA: ఆసక్తిగా గులాబీపార్టీ రాజకీయం.. ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల అల్టిమేటం
ఈ పరిస్థితుల్లోనే ఇటీవల జరిగిన ఓ సంఘటన పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చిందట. కొన్ని రోజుల క్రితం నరసరావుపేటలో ఓ ముస్లిం నేత హత్య జరిగింది. ఆ హత్యకు మసీదు వ్యవహారానికి సంబంధం ఉందని ప్రచారం జరిగింది. హతుడు అప్పటికే టీడీపీలో కొనసాగుతూ ఉంటే.. అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్థానికంగా ఉన్న ఓ కీలక నేత ప్రచారం చేశారట. అంతే కాకుండా.. పార్టీ అధినాయకత్వం నజీర్ అనే నాయకుడిని నరసరావుపేటకు పంపితే.. సదరు నజీర్‌ను వెనక్కి వెళ్లిపోమ్మని వెంటపడ్డారట. ఆయన తిరిగి వెళ్లిపోయేంత వరకు ఒకరిద్దరు నేతలు వదిలి పెట్టలేదట. పెద్దగా ఇష్యూ ఏం లేదు. మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోతేనే బెటరనే రీతిలో చెప్పుకొచ్చారట. ఆ విషయాన్ని నజీర్ హైకమాండ్‌కు చేరవేసినట్టు తెలుస్తోంది. ఓ పక్క అదే జిల్లాలో మాచర్ల ఘటన మరువక ముందే నరసరావుపేటలో టీడీపీ కార్యకర్త హత్య జరిగితే.. అదీ మైనారిటీ నేతను హత్య చేస్తే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న డాక్టర్ అరవింద్‌బాబు ఎందుకలా చెప్పారు? విషయాన్ని ఎందుకు డైవర్ట్ చేశారు అని టీడీపీ హైకమాండ్ వద్ద చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
నరసరావుపేట ఘటనపై ఆరా తీస్తే.. స్థానిక టీడీపీ నేతల్లో కొందరికి.. ఎమ్మెల్యే గోపిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారట. ఎమ్మెల్యే కోసమే స్థానిక నేతల్లో విషయాన్ని తప్పుదారి పట్టించారని టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్క నరసరావుపేటలోనేనా.. ఇంకేమైనా నియోజకవర్గాల్లో ఇదే తరహాలో స్థానిక నేతలు.. ఇన్ఛార్జులు లోకల్ వైసీపీ ఎమ్మెల్యేలతో కుమ్మక్కు అవుతున్నారా..? అనేది ఆరా తీస్తున్నారట. దానికి సంబంధించి ఓ జాబితాను కూడా సిద్ధం చేయాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఓవైపు పార్టీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ హైకమాండ్ నానా తంటాలు పడుతుంటే.. క్షేత్ర స్థాయిలో కొందరు ఇన్ఛార్జులు.. మరికొందరు స్థానిక నేతలు ఏం పట్టనట్టు వ్యవహరించడమే కాకుండా.. కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. కుమ్మక్కు నేతల జాబితా సిద్ధం చేస్తే.. వారిపై చర్యలు ఉంటాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.