అసని తుఫాన్ ఏపీ వైపునకు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 670కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీవ్ర తుఫాన్ ప్రవేశించనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ దిశను మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి ప్రయాణిస్తుందని భావిస్తోంది.
సని తుఫాన్ ఒడిశా వైపు వెళ్లినా.. ఏపీ తీరంపైనా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆయా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీవ్ర తుఫాన్ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే గంటకు 100 నుంచి 125 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Asani Cyclone: తీవ్ర తుఫాన్‌గా ‘అసని’.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక