Case Filed Against Jogi Ramesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్‌పై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం రావడంతో, ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన.. ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్, పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగమోహన్ రావుతో కలిసి రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.
