Site icon NTV Telugu

Minister Peddireddy Ramachandra Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. అవి స్మార్ట్‌ మీటర్లు కాదు..!

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Minister Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా అధికార, ప్రతిక్షాల మధ్య సభలో సవాళ్ల పర్వం చోటు చేసుకుంది.. మూడు ఎమ్మెల్సీల్లో ఓటమి పాలైనందుకు వైసీపీ సభ్యుల మైండ్ బ్లాంక్ అయ్యిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి సిదిరి అప్పలరాజు.. ధైర్యం ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.. మరోవైపు.. వ్యవసాయ మోటార్లకు బిగించిన మీటర్లపై క్లారిటీ ఇచ్చారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదు డిజిటల్ మీటర్లు మాత్రమేనన్న ఆయన.. పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించాం.. మీటర్లు బిగించటం వల్ల దాదాపు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అయ్యిందన్నారు.. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అయినట్టు తేలిందని స్పష్టం చేశారు.

Read Also: CM YS Jagan Review: అకాల వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

అయితే, టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో 10 వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.. రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నాం.. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు అని ఎద్దేవా చేశారు.. ఇక, వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల అంశం పై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాడులను వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు వైసీపీ సభ్యులు.. ఎఫ్ఆర్బీఎమ్ లో రుణ పరిమితి పెంచుకోవడానికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టడం దారుణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నారు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి జోగి రమేష్.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్ బాగ్ లో రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదన్న ఆయన.. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు.. అంటూ ఎద్దేవా చేశారు.

Exit mobile version