NTV Telugu Site icon

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొత్త సంవత్సరం రోజు సిఫార్సు లేఖలు రద్దు

డిసెంబర్‌ 31వ తేదీన ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్‌లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్‌ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జ‌న‌వ‌రి 1తో పాటు జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.. అయితే, స్వయంగా వ‌చ్చే ప్రముఖుల‌కు మాత్రమే బ్రేక్ ద‌ర్శనం కల్పించనున్నారు. భ‌క్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ స్పష్టం చేసింది..

Read Also: డిసెంబర్ 31, శుక్రవారం దినఫలాలు

మరోవైపు.. జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేసింది టీటీడీ.. శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణయించింది.. జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. ఇక, వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయంపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఈ ఏడాది శ్రీవారిని కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండీ ద్వారా శ్రీవారికి రూ.826 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది.. ఇక, ఈ ఏడాది కూడా టీటీడీ బడ్జెట్‌ అంచనాలు తప్పాయి.. అయితే, ఈ ఏడాది హుండీ ద్వారా 1,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది టీటీడీ.. కానీ, అది రూ.826 కోట్లకే పరిమితం అయ్యింది.. కరోనా ఎఫెక్ట్‌తో శ్రీవారిని దర్శించుకునే భక్తులపై ఆంక్షలు విధించడం.. ఆ తర్వాత క్రమంగా అనుమతి ఇచ్చినా.. సాధారణ పరిస్థితులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.