జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రచ్చగా మారాయి.. తన విశాఖ పర్యటనలో ఆంక్షలు, జనసేన నేతలపై కేసులపై భగ్గుమన్న పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు విప్పి మరీ చూపించారు.. అంతేకాదు.. తన మూడు పెళ్లిళ్లపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇస్తూ.. వీడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకున్నాను.. భరణం ఇచ్చాను.. ఆస్తులు రాసిచ్చి పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు.. దీనిపై కూడా అధికార పార్టీ నేతలు కౌంటర్లు వేశారు.. ఏపీ మహిళా కమిషన్ నుంచి పవన్ కల్యాణ్‌కు నోటీసులు కూడా వెళ్లాయి.. అయితే, బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ మూడు వివాహాల గురించి మాట్లాడబోదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు..
Read Also: Jio and Vi Festive Deals: స్పెషల్ ఆఫర్లకు జియో, ఐడియా గుడ్‌బై.. త్వరపడితేనే మరి..!
అనంతపురం పర్యటనలో ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. డీసెంట్రలైజేషన్ గురుంచి మాట్లాడే అధికారం సీఎం వైఎస్ జగన్‌కు లేదని మండిపడ్డ ఆయన.. విశాఖను స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసింది… ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే.. కానీ, కుటుంబ పార్టీలది కాదన్నారు.. ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.. అనంత నగరం వరదల్లో మునిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. అనంత నష్టంపై ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించకపోవడం బాధాకరమన్న ఆయన.. కుటుంబ పార్టీల మూలంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. పవన్ మూడు వివాహాల గురించి బీజేపీ మాట్లాడబోదు అన్నారు.. కానీ, పవన్ మాట్లాడిన అంశాల గురించి కూర్చొని మాట్లాడుకుంటామన్నారు.. మరోవైపు, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన వాటి గురించి కూడా తాను స్పందింబోను అన్నారు సోము వీర్రాజు.. కాగా, బీజేపీతో పొత్తు గురించి కూడా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.