ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి చేస్తే నేడు జగన్ నాశనం చేస్తున్నాడని విమర్శించారు.
Also Read: మార్కాపురం కోర్టుకు హాజరైన హీరో సుమంత్.. కారణం ఏంటంటే..?
నాడు అమరావతికి జై అన్న జగన్ నేడు మూడు ముక్కలాట ఆడుతున్నారని, నాడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అని చెప్పి నేడు రూ.10 కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జగన్ పాలనలో అమరావతి అటకెక్కిందని పోలవరం పడకేసిందని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో అమరావతి రైతులు రోడ్డెక్కారని, పోలవరం నిర్వాసితులు నిరసన దీక్షలు చేపట్టారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. జగన్ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
