బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. వేలంలో శనివారం నాడు ఏకంగా 10 మంది ఆటగాళ్లు రూ.10 కోట్లుపైన ధర పలికారు. ఆదివారం కూడా ఆటగాళ్ల వేలం జోరుగా సాగుతోంది. ఈ మేరకు తెలుగు ప్లేయర్ ఐపీఎల్ మెగా వేలంలో ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్‌ను నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
అశ్విన్ హెబ్బార్ 2015 నుంచి రంజీల్లో ఆంధ్రా టీం తరపున ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2017-18, 2018-19, 2021-22 సీజన్లలో రాణించాడు. కెరీర్‌లో 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. దేశం తరపున ఆడటమే తన లక్ష్యమని అశ్విన్ హెబ్బార్ చెబుతున్నాడు. అతడికి ప్రస్తుతం 26 ఏళ్లు. రంజీ ప్లేయర్‌గా అవకాశమే గొప్పగా భావిస్తున్న ఈ తరుణంలో నెల్లూరు కుర్రోడు అశ్విన్ హెబ్బార్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐపీఎల్‌కు ఎన్నికవడం తమకు గర్వకారణమని జిల్లా క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
