Andhra Pradesh Weather Report For Next 3 Days: ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ & వాయువ్య గాలులు వీస్తున్న తరుణంలో.. అమరావతి వాతావరణ కేంద్రం రాబోవు మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు & హెచ్చరికల్ని జారీ చేసింది. ఉత్తర కోస్తా ఏపీ & యానాంలో ఒకట్రెండు చోట్ల ఈరోజు, రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి కొన్ని చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఇదే సమయంలో ఉరుములతో కూడిన మెరుపులు కూడా ఒకట్రెండు చోట్ల సంభవించే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, అలాగే రాయలసీమలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కువరనున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజల్ని సూచించింది. ఇదిలావుండగా.. భారీ వర్షాల కారణంగా గత నెలలో ఏపీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే! గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం, భారీ వరదల వల్ల అపారనష్టం కలిగింది. వేలాది ఎకరాల పంట నష్టపోగా, చాలామంది నిరాశ్రయులయ్యారు. ఏకంగా 241 గ్రామాలు వరద బీభత్సానికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ మబ్బులు కమ్ముకుంటున్న తరుణంలో.. ఏపీ ప్రజల్లో భయం అలుముకుంది. అయితే.. మునుపటి స్థాయిలో వర్షాలు రాకపోవచ్చని, ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని వాతావరణ కేంద్రం పేర్కొంది.