NTV Telugu Site icon

AP Deputy CM: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..

Pawan Kalyan

Pawan Kalyan

AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు. ఈ రోజు (బుధవారం) మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ.. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జేజేఎంలో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపించిన నిధులను గత ప్రభుత్వం ఏ దశలోనూ సక్రమంగా వినియోగించలేదని చెప్పుకొచ్చారు.

Read Also: Suspended : ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్

ఇక, ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన పనుల్లో పైప్ లైన్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేయలేదని సమీక్షల ద్వారా తేలిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పలు చోట్ల అసలు పనులే మొదలు కాలేదు.. వీటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంది.. జల్ జీవన్ మిషన్ పనులు సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని ఇవ్వగలం.. ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టబోతుందో.. ఇందుకు అనుసరించే ప్రణాళికలను తెలియజేసేందుకు ఆర్.డబ్ల్యూఎస్ విభాగానికి చెందిన ఎస్ఈలు, ఈఈలతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. అదే విధంగా క్షేత్ర స్థాయి ఇంజినీరింగ్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్ఈలు, ఈఈలతో వర్క్ షాప్ ను వచ్చే నెల 8వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.