ఏపీ డీజీపీకి రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంట్లో పని చేస్తోన్న దళిత మహిళను వేధిస్తోన్న ఘటనలో డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. దళిత మహిళపై దొంగతనం బనాయించి అక్రమంగా కేసు పెట్టారంటూ NHRCకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నేరం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ ఉమా మహేశ్వరిని కస్టోడియల్ టార్చర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల రామయ్య. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ఐజీ స్థాయి అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డీజీపీకి NHRC ఆదేశాలు జారీచేసింది.
అసలేం అయిందంటే..?
ఈ ఏడాది జనవరిలో దళిత మహిళ ఉమామహేశ్వరి జీవనోపాధి కోసం చిత్తూరు జిల్లాలోని లక్ష్మీనగర్ కాలనీకి వచ్చింది. భర్త భవన నిర్మాణ కార్మికుడు కాగా, ఆమె ఇళ్ళలో పనిచేసేది. మైథిలి అపార్టుమెంటులో జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి ఇంటితో పాటు మరో ఐదు ఇళ్లల్లో ఈ ఏడాది జనవరిలో పనిమనిషిగా చేరింది. జైల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటికి ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పనికి వెళ్ళింది. అప్పటికే జైల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి సతీమణి విజయ ఇల్లంతా వెదుకుతోంది. ఏమైందని అడిగిన ఉమామహేశ్వరికి చేదు అనుభవం ఎదురైంది. దీనికి ఆగ్రహించిన విజయ ఒక్కసారిగా ఉమామహేశ్వరిపై తీవ్ర స్ధాయిలో మండిపడుతూ ఇంట్లో దాచిన నగదును నువ్వే ఎత్తుకెళ్ళావు అంటూ గట్టిగా కేకలు వేసింది. ఆమె తీసిందని పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఇంటికెళ్లి భోజనం చేసి రావాలని ఉమామహేశ్వరిని పంపించేసింది జైల్ సూపరింటెండెంట్ భార్య. ఇంటికి వెళ్ళిన కాసేపటికే స్టేషన్ కు రావాలంటూ ఉమామహేశ్వరికి వన్ టౌన్ పోలీసులు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్లగానే ఆమె వేలిముద్రలు తీసుకున్న పోలీసులు రాత్రి 9గంటల వరకు స్టేషన్లోనే ఉంచారు. మరుసటి రోడు ఉదయం 11గంటలకు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఉమామహేశ్వరిని మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారు. సీఐ వచ్చి చచ్చిపోతుందని చెప్పడంతో కాసేపు వదిలేశారు. గంట తర్వాత మళ్లీ కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఇంతలో పోలీస్ స్టేషన్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఉమామహేశ్వరి వేలిముద్రలు సరిపోలేదనేది చెప్పడంతో ఆమెని వదిలేశారు. నీ తప్పులేదని చెప్పారు. ఆమె భర్తను పిలిచి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆస్పత్రికి పంపారు. తర్వాతి రోజు ఆస్పత్రికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్… జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటే డబ్బులిస్తామంటూ ఆశచూపించాడు. అందుకు వారు సమ్మతించకపోవడంతో అక్రమ కేసు పెట్టి లోపలు వేస్తామని ఉమామహేశ్వరిని బెదిరించారు. అందుకు భయపడని ఉమామహేశ్వరి తనకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డీఐజీ సెంథిల్‌కుమార్, ఎఎస్‌పి మహేష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశారు. కానిస్టేబుల్ సురేష్‌బాబును నిందితుడిగా నిర్దారించి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీనిపై NHRC డీజీపీకి నోటీసులు జారీచేసింది.
Chandini Chowdary: అవకాశాల కోసమే లిప్ లాక్..?