పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు కునరిల్లుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీన నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందన్నారు.
జాతీయ విద్యా విధానం అమలును ఇంకా ఏ రాష్ట్రం మొదలు పెట్టకుండానే ఏపీలో ప్రారంభించేశారని.. సమస్యలపై ఎటువంటి అధ్యయనం లేకుండా మన రాష్ట్రంలో ఆరంభించడం వల్ల బడికి దూరమైన విద్యార్థులు రోడ్డున పడటం చూశామని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్ఈపీ సూచనల మేరకు కరిక్యులమ్, బోధనా విధానాలు అమలు కోసమే పాఠశాల విద్యను నాలుగు స్థాయిలుగా విభజించారన్నారు. అయితే పాఠశాలలను విభజించాల్సిన అవసరంలేదని కేంద్రం స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శలు చేశారు. పాఠశాలలను విభజించడంతో సమస్య తీవ్రమైందని.. జాతీయ విద్యావిధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు, ఉపాధ్యాయులను తగ్గించే ఆతృత ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు.
Sajjala: రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్ ఎవరికి? వెంకయ్య ఉంటేనే మద్దతిస్తారా?
Read Also:
మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో అమలు వల్ల పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయన్నారు. దివేందుకు ఇంటికి దగ్గరలో ఉన్న బడినే తీసేయడం పేదవారిని చదువుకు దూరం చేయడమే అవుతుందన్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూళ్లలోనూ కలపటంవల్ల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందన్నారు. హెడ్‌మాస్టర్, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించకపోవడం విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.
పిల్లలకి పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలోపే ఉండాలని విద్యావిధానాలు చెబుతుంటే ప్రభుత్వం ఏకంగా 3 కిలోమీటర్ల దూరానికి పాఠశాలలు తరలించడం ప్రభుత్వ విద్యను పేదలకి దూరం చేయడమేనని లోకేష్ ఆరోపించారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేషనలైజేషన్ పేరుతో నియంతృత్వ పోకడలతో అమలు చేస్తోన్న ఈ విద్యావిధానం వల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠశాలలు భవిష్యత్తులో 11 వేలకు తగ్గిపోతాయన్నారు. రేషనలైజేషన్ విధానంవల్ల మొత్తం 55 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడం విద్యా వ్యవస్థకే మరణ శాసనం లాంటిదన్నారు. మరో పదేళ్లపాటు డీఎస్సీ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో టీచర్ కావాలని కలలు కంటున్న లక్షలాది మంది ఆశలు ఆవిరి చేయడం దారుణమని లోకేష్ విమర్శలు చేశారు. తల్లిదండ్రులు కూలీ, నాలికి వెళ్తే.. ప్రభుత్వం దూరం చేసిన పాఠశాలలకు వాగులు, వంకలు దాటి పిల్లలు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. పాఠశాలలు తెరిచిన రోజునే రాష్ట్రవ్యాప్తంగా తమ బడులు తరలించొద్దంటూ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్లు ఎక్కారన్నారు. జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్యయనం లేకుండానే అమలు చేయడంతో 10 వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్‌కు రాసిన లేఖలో లోకేష్ కోరారు. పేదపిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.