NTV Telugu Site icon

Nara Lokesh: అన్నా క్యాంటీన్‌లు తెరిచి పేదల ఆకలి తీర్చండి.. జగన్‌కు డిమాండ్

Nara Lokesh

Nara Lokesh

అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేద‌ల‌ ఆక‌లి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్‌లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంట‌నే అన్నగారి పేరు మీద ద్వేష‌మో .. ఆక‌లి జీవులంటే అస‌హ్యమో తెలియ‌దు కానీ అన్నా క్యాంటీన్‌లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయ‌డంతో పేద‌లు, కూలీలు, అభాగ్యుల ఆక‌లి తీర్చే మార్గం లేకుండా పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారని.. అన్నా క్యాంటీన్ల కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించామని లేఖలో లోకేష్ గుర్తుచేశారు.

అయితే జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారని లోకేష్ విమర్శించారు. అన్నా క్యాంటీన్‌లను మూసేసే కుట్ర జ‌రుగుతోంద‌ని తాము అడిగితే లేద‌ని స‌మాధానం ఇచ్చిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే అన్నా క్యాంటీన్‌లను మూసివేసిందన్నారు. దీంతో ప్రభుత్వం రోజుకి 3 లక్షల మందికి ఆక‌లి మిగిల్చిందన్నారు. నిరుప‌యోగంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అసాంఘిక కార్యకలాపాల‌కు అడ్డాగా మారాయని లోకేష్ విమర్శించారు. కూలీల‌కు ప‌నుల్లేవు.. కార్మికుల‌కి ఉపాధి దొర‌క‌డంలేదు.. యాచ‌కులు ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతున్నారని.. పేదల ఆక‌లి తీర్చాల‌ని టీడీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్‌లను న‌డుపుతున్నామని తెలిపారు. దాతల సాయంతో తాము నడుపుతోన్న అన్న క్యాంటీన్లకు వస్తోన్న పేదలను చూస్తోంటే ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు.ప్రభుత్వం పెట్టదు.. పెట్టేవాళ్లని అడ్డుకుంటుందని.. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే ధోరణి మంచిది కాదని లోకేష్ హితవు పలికారు. తాము పెడుతున్న అన్నా క్యాంటీన్‌లను కూల్చడం, అడ్డుకోవడం లాంటి పనులు ఇకనైనా ఆపాలని కోరుతున్నానని లేఖలో లోకేష్ తెలిపారు. నిధులు లేవు, అప్పులు దొర‌క‌డం లేద‌ని మాత్రం సాకులు వెత‌క‌కుండా ఆక‌లి తీర్చే అన్నా క్యాంటీన్‌ల కోసం జగన్ సర్కారు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Show comments