పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి తాము పోరాడుతుంటే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతోందని విమర్శలు చేశారు. అధికారులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని.. జగన్ మాఫియా రెడ్డి శాశ్వతం కాదని.. వ్యవస్థలు శాశ్వతం అని, రాష్ట్రం శాశ్వతం అని లోకేష్ వ్యాఖ్యానించారు.
మరోవైపు లోకేష్ సినిమా తరహాలో పవర్‌ఫుల్ డైలాగులు కూడా చెప్పారు. అన్న ఎన్టీఆర్ తమకు దేవుడు అని.. చంద్రబాబు తమకు రాముడు అని.. కానీ లోకేష్ మాత్రం మీ లాంటోళ్లకు మూర్ఖుడు అని వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ ఈ డైలాగ్ చెప్పగానే అక్కడున్న టీడీపీ నేతలు విజిళ్లతో హోరెత్తించారు. రాముడు అయినా మరిచిపోతాడేమో కానీ.. తాను మాత్రం వైసీపీ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎలా చేశారో వైసీపీ నేతలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని.. ఆనాడు జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించాం కాబట్టే జగన్ పాదయాత్ర చేయగలిగాడని లోకేష్ పేర్కొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మార్చుకోవాలని.. పిల్లి రామకృష్ణారెడ్డి అని పెట్టుకోవాలని లోకేష్ సూచించారు.