Site icon NTV Telugu

అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి అంతు చూస్తా: లోకేష్

జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి అంతు చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.

Read Also: ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?

ఇప్పటికే తన మీద 11 కేసులు పెట్టారని.. ఇప్పుడు ఇంకో కేసు పెడితే 12 అవుతాయని.. వాటితో ఏం చేయగలరు అని లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఎయిడెడ్ కాలేజీల విలీనంపై అనంతపురంలోని విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్ చర్చలు జరిపారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యార్థుల పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని టీడీపీ నేతలతో పాటు వామపక్షాల నేతలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు.

Exit mobile version