Site icon NTV Telugu

Nara Lokesh: మూడు రాజధానులు కావాలంటే.. 175 జిల్లాలు చేయండి

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టులపై వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. కేవలం మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని కోర్టు చెప్పిందని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనేది పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని.. పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీ కేబినెట్‌లో 90 శాతం టెన్త్ ఫెయిలైన బ్యాచ్ ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మూడేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురానివారు.. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే.. ఏపీకి మాత్రం ఒక్క పరిశ్రమ కూడా రాని దుస్థితి నెలకొందన్నారు. పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక.. ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని.. కొత్త జిల్లాల వల్ల ఉపయోగం ఏంటని.. ఒక్క ఉద్యోగం అయినా వస్తుందా అని లోకేష్ నిలదీశారు.

మరోవైపు వైసీపీ నేతల కంటే ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌లే నయమని లోకేష్ వ్యాఖ్యానించారు. పదో తరగతిలో పేపర్లు ఎత్తుకెళ్లిన బ్యాచ్.. పదో తరగతి చదువుతున్న నిరుపేద మైనారిటీ విద్యార్థినిని ఏకంగా వెంటాడి వేధించి బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడేలా చేసిన నీచ‌ చ‌రిత్ర అని ఆరోపించారు. బంగారు భ‌విష్యత్ ఉన్న చ‌దువుల త‌ల్లి మిస్బా మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వైసీపీ నేత సునీల్‌, ప్రిన్సిపాళ్లపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version