ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే ప్రజలను, విద్యార్థి సంఘాలను అక్రమంగా అరెస్టులు చేయించడం జగన్‌కే చెల్లిందని…రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటరంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
Read Also: టీడీపీ నేతలకు వార్నింగ్.. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల ధర్నా
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వంలోని పెద్దలు కనీసం మనుషులుగా కూడా చూడకుండా అవమానిస్తున్న తీరు బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చేయకుండా సీపీఎస్ రద్దు చేయాలని లోకేష్ అన్నారు. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టిన ఏడు డీఏలు వెంటనే ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హితవు పలికారు.
