Site icon NTV Telugu

Nara Lokesh : క్షమాపణలు చెబితేనే.. సమావేశాలకు వెళ్తాం..

గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 7 నుంచి మొద‌లు కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ స‌మావేశాలకు వెళ్లాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై టీడీపీలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఇప్పటికే గురువారం మ‌ధ్యాహ్నం అమ‌రావ‌తిలో భేటీ అయిన టీడీపీ అత్యున్నత నిర్ణాయ‌క విభాగం పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది.

చంద్రబాబు భార్యపై మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేశార‌ని, వారు బేష‌ర‌తుగా క్షమాప‌ణ‌లు చెప్పేదాకా అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లరాద‌ని పొలిట్ బ్యూరోలోని మెజారిటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. మంత్రులు క్షమాప‌ణ‌లు చెప్పక‌పోతే ఎలాంటి వ్యూహం అవ‌లంబించాల‌న్న దానిపై పొలిట్ బ్యూరోలో ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేద‌ట‌. దీంతో దీనిపై టీడీపీఎల్పీలో చ‌ర్చించి నిర్ణయం తీసుకోవాల‌ని చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా ఈ అంశంపై పార్టీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాట్లాడారు. త‌న త‌ల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన‌ మంత్రులు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌మావేశాల‌కు వెళ్లాల‌న్న పొలిట్ బ్యూరో నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వ వైఖ‌రిని నిల‌దీసేందుకు అవ‌కాశం ఉన్న అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌క‌పోతే బాగోదేమోన‌న్న అభిప్రాయాన్ని కూడా ఆయ‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీడీఎల్పీ భేటీలో ఈ విష‌యంపై చ‌ర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామ‌ని లోకేశ్ చెప్పారు. అయితే త‌న త‌ల్లిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మంత్రులు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెబితే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లే విష‌యంపై ఇక ఎలాంటి చ‌ర్చ లేకుండానే స‌భ‌లో అడుగుపెడ‌తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Exit mobile version