Site icon NTV Telugu

Sankranti Festival: మూడేళ్ల తర్వాత నారావారిపల్లెకి నారా, నందమూరి కుటుంబాలు

Naravari Palle

Naravari Palle

Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు నారావారిపల్లె వెళ్లనున్నాడు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి కుమారుడు దేవాన్ష్ కూడా సంక్రాంతి సంబరాల్లొ పాల్గొననున్నారు.

Read Also: Nellore District: కలకలం రేపుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి వివాదం

మూడేళ్ళ తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అటు ఈనెల 12న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ విడుదల అవుతుండటంతో ఈ సందడి రెట్టింపు కానుంది. 12న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్ లు నారావారిపల్లెకు చేరుకుంటారు. 13న చంద్రబాబు, నారా లోకేశ్, బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తారు. 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తిరుగుపయనమవుతారు. 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు పయనమవుతారు.

కాగా చివరిసారిగా 2019లో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చంద్రబాబు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఊరి జనంతో రెండు కుటుంబాలు కలిసిపోయాయి. సంక్రాంతి పిండి వంటలతో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మరింతగా జోష్ పెంచేలా టీడీపీ నేతలు, బంధువులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version