NTV Telugu Site icon

Online Betting: రెండు ప్రాణాలు తీసిన బెట్టింగ్‌.. కొడుకు కోట్లలో అప్పు.. తల్లిదండ్రుల ఆత్మహత్య..

Online Betting

Online Betting

Online Betting: కష్టం లేకుండా.. కదలకుండా డబ్బు వచ్చేస్తుందన్న దురాశ.. కొందరి జీవితాల్లో తీరని దుఃఖాన్ని మిగిలిస్తోంది.. “కాయ్ రాజా కాయ్” అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్ వేదికగా జడలు విప్పాయి. మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.. వెనక్కి మళ్లీ చూస్తే ఏమీలేదు.. కన్నవారు.. కట్టుకున్నవారు కూడా దూరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా నంద్యాలలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: Google Pixel Buds Pro 2: గూగుల్‌ పిక్సెల్‌ నుంచి బడ్స్‌, వాచ్‌.. ధర, ఫీచర్లు ఇవే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్‌ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. యువరైతు మహేశ్వర్ రెడ్డి అప్పులు అధికం కావడంతో ఒత్తిళ్లు తట్టుకోలేక గత కొంత కాలంగా వెలుగోడులోని తన మామ వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. అయితే, అప్పులు తీర్చడం కష్టసాధ్యమని భావించిన మహేశ్వర్ రెడ్డి తన భార్య ప్రశాంతితో కలిసి వెలుగోడులో సమీప పొలాల్లో కూల్ డ్రింక్ లో పురుగు మందు కలుపుకొని సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ లక్మీనారాయణ, వెలుగోడు ఎస్.ఐ గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి మామ వెంకటేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ దంపతుల ఆత్మహత్యకు కొడుకు చేసిన అప్పులే కారణంగా చెబుతున్నారు.. ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడిన కొడుకు.. కోట్లలో అప్పులు చేయడంతో.. పరువు కోసం పొలాలు అమ్మి కొంత మేర అప్పుతీర్చిన ఆ దంపతులు.. మరిన్ని అప్పులు తీర్చడం తమ వల్ల కాదనే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

Show comments