NTV Telugu Site icon

Nandamuri Balakrishna: సోషల్ మీడియా వైపు వెళ్లకండి.. విద్యార్థులకు బాలయ్య సూచన

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

సోషల్‌ మీడియా వైపు వెళ్లకండి.. ఫేస్‌బుక్‌ చూస్తూ కాలం వృథా చేయకుండి అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గంలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది.. ఇవాళ హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు బాలయ్య.. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.. హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థను తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్న ఆయన.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్నిచ్చే సినిమాలను చూడాలి.. ఫేస్‌బుక్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి అని సూచించారు.

Read Also: YouTube Channels Blocked: యాంటీ భారత్‌ కంటెంట్‌.. మరికొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు బ్లాక్..

ఇక, రోడ్లు అధ్వాన స్థితిలో ఉంటే చివరకు గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు బాలయ్య.. కాగా, తన తొలిరోజు పర్యటనలో.. అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు బాలయ్య.. హిందూపురం మండలం చలివెందులలో ఈ ఆరోగ్య రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందిస్తుందని వెల్లడించారు.. ఈ వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసిన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉంటారని.. సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారని నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.