Site icon NTV Telugu

ఆర్టీసీ టిక్కెట్ ధరలను తగ్గించే దమ్ముందా?: నాదెండ్ల మనోహర్

ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు

మరోవైపు సొంత రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ఏపీలోని ప్రజలు పలు ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నారని.. అలాంటి వారు సంక్రాంతి పండక్కి ఆర్టీసీ బస్సుల్లో రావాలంటే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వారు ప్రయాణించే బస్సుల్లో టిక్కెట్ ధరలను ఇష్టం వచ్చినట్లు 50 శాతం పెంచేశారని… సామాన్యుల కోసం ఆర్టీసీ టిక్కెట్ ధరలను తగ్గించే దమ్ము జగన్‌కు ఉందా అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అవి పట్టించుకోవడం మానేసి… సినిమా టిక్కెట్ ధరలను తగ్గించడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Exit mobile version