తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని, కౌలుదారు చట్టంలో తప్పిదాలు జరిగాయన్నారు. రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గమని, కౌలు రైతులు అల్లాడిపోతున్నారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జీవో ప్రకారం 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు భరోసా పథకం క్రింద 2 లక్షల రూపాయలు అందిస్తామని వైసీపీ నేతలు ఆత్మహత్యలు కాదని మార్చేస్తున్నారన్నారు. జీవో 102 అమలుకు ఉభయగోదావరి జిల్లాలు వేదికగా జనసేన ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి నెల రోజుల్లో స్పందన రాకపోతే జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకుని బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రైతు స్వరాజ్య వేదిక అందించిన రిపోర్ట్ మేరకు కౌలు రైతుల కష్టాలపై జనసేన ఆందోళన చేపడుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉద్యమం చేస్తామన్నారు.
