NTV Telugu Site icon

Nadendla Manohar: రైతుల్ని మోసం చేయడంలో జగన్‌ని మించినవారు లేరు

Nadendla Manohar Counter To Cm Jagan

Nadendla Manohar Counter To Cm Jagan

గణపవరంలో ప్రసంగంలో భాగంగా పవన్ కళ్యాణ్‌ రైతు భరోసా యాత్రపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల్ని మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్‌ని మించిన వాళ్ళు మరెవ్వరు ఉండరని విమర్శించారు. వైకాపా చెప్పిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కలుపుకుంటే ప్రతి రైతుకు రూ. 19,500 రావాలని.. కానీ జగన్ ప్రభుత్వం ఇస్తోంది కేవలం రూ. 13,500 మాత్రమేనని అన్నారు. ఈ లెక్కన ఒక్క రైతుపై జగన్ సర్కారు రూ. 6 వేలు మిగుల్చుకుంటోందని, దీనికి ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. జగన్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల అన్నారు. తాను రైతు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్.. అలా చెప్పుకుంటున్నందుకు సిగ్గుపడాలన్నారు. ఆయన చంచల్‌గూడ బిడ్డ అని అందరికీ తెలుసని, గణపవరంలో చేసిన ప్రసంగం పవన్ చేపట్టిన రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్ళగక్కడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పవన్ పర్యటించి.. మొత్తం 200 మంది కౌలు రైతు కుటుంబాల్ని పరామర్శించారని, వారికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం కూడా చేశారన్నారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదని జగన్ రెడ్డి చెప్పగలరా? అని నిలదీశారు.

గత మూడేళ్ళుగా వైకాపా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సును పట్టించుకోకుండా సాగిస్తోన్న పరిపాలనతో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని నాదెండ్ల చెప్పారు. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారని.. దీంతో వారికి బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా వంటివేమీ వర్తించడం లేదని వెల్లడించారు. రైతుల్ని కులాలవారీగా విభిజించి లబ్ది పొందాలని ఆలోచిస్తోన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైకాపా సర్కారేనని ఆగ్రహించారు. రైతుల పట్ల జగన్‌కి చిత్తశుద్ధి ఉంటే.. కులాల వారీగా విభజిస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని తొలగించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

జీవో 102, 43లను అనుసరించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రూ. 7 లక్షలు ఇవ్వాలని.. కానీ రూ. 1 లక్ష పరిహారం ఇచ్చి జగన్ సర్కార్ సరిపెట్టుకుందని నాదెండ్ల మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న ధైర్యం జగన్‌కి ఉందా? అని సవాల్ విసిరారు. చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి, గొప్పలు చెప్పుకున్నా.. రైతులు విశ్వసించరని, వాస్తవాలేంటో రైతాంగానికి తెలుసని నాదెండ్ల మనోహర్ అన్నారు.