Site icon NTV Telugu

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేసిన ముస్లిం దంపతులు

Tirumala

Tirumala

Muslim Couple Donation in Tirumala: తిరుమల శ్రీవారి ఖాతాలో భారీ ఎత్తున విరాళాలు చేరుతున్నాయి. ఇటీవల రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాజాగా చెన్నైకు చెందిన ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల భారీ విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఈ విరాళాన్ని అందించారు. ముస్లిం దంపతులు విరాళం తాలూకు చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కాగా ఈ దంపతులు తాము సమర్పించిన విరాళంలో రూ.87 లక్షలను ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు, మిగతా రూ.15 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఉపయోగించాలని టీటీడీని కోరారు.

గుడిలో వివాహం చేసుకున్న ముస్లిం జంట
18 ఏళ్ల క్రితం వివాహం జరిగి 9 మంది సంతానం ఉన్న ఓ ముస్లిం జంట హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాకు చెందిన కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫా 18 ఏళ్ల తర్వాత యూపీలోని జౌన్‌పూర్‌ త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారి రవిశంకర్ గిరి మళ్లీ పెళ్లి చేశారు. ముస్లిం దంపతులు హిందూ ఆచారాల ప్రకారం అగ్నిని సాక్షిగా భావించి త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేశారు. ముస్లిం దంపతులు భారతదేశ పర్యటనలో భాగంగా వారణాసి ఘాట్‌లు, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించిన సమయంలో హిందూ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో వారు హిందూ ఆచారాల ప్రకారం మళ్లీ వివాహం చేసుకోవాలని భావించి భగవంతుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. కాగా తన తాత భారతీయ సంతతికి చెందిన హిందువు అని కేషా ఖలీఫా పేర్కొన్నారు.

Exit mobile version