Site icon NTV Telugu

Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్‌..

Sansad Ratna Award

Sansad Ratna Award

Sansad Ratna Award 2023: ఢిల్లీలో సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డులు అందుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్.. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు వచ్చింది.. ఈ సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్‌లో బాగా పనిచేస్తున్నారు.. ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు అని ప్రశంసించారు.. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను.. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారని తెలిపారు బండారు దత్తాత్రేయ.

ఇక, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది.. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు.. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95శాతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందన్నారు.

మరోవైపు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు.. కానీ, స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు.. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు.. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉందన్నారు. పర్యాటక, సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.. ఇక, చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌. కాగా, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రేమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ సంసాద్ రత్న అవార్డులను అందజేస్తోంది..

Exit mobile version