NTV Telugu Site icon

MP Margani Bharat Ram: జగన్ పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి.. ప్రజలకు ఏం కావాలో ఆయనకే తెలుసు..!

Mp Margani Bharat Ram

Mp Margani Bharat Ram

MP Margani Bharat Ram: పేదల గుండె చప్పుడు, వారి హృదయంలో మాట, వారికేమి‌ అవసరమో ఒక్క సీఎం వైఎస్‌ జగనన్నకే తెలుసునని, అందుకే ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట ఫారెస్ట్ కల్యాణ మండపంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాస్ చంద్రబోస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్, కరపత్రాలు, మొబైల్ ఫోన్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ జరగలేదన్నారు.

Read Also: Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్

ఇక, ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలన ఒక మహా యజ్ఞంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని తెలిపారు ఎంపీ భరత్‌. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినది మొదలు నేటి వరకూ ఈ నాలుగేళ్ళలో రూ.2లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా సొమ్ములు జమ చేసిన ఘనత జగనన్నదని అన్నారు. నాలుగు సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి చేస్తే, మరో ఐదు సంవత్సరాలు మళ్లీ సీఎంగా జగనన్నకే‌ అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని మరింత సర్వతోముఖాభివృద్ధి చేస్తారన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకుని, వారి జీవన‌ విధానంలో పెనుమార్పులు తీసుకు రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపన దిశగా జగన్ పాలన కొనసాగుతోందని, జగన్ పాలనపై అన్ని వర్గాల నుండి పూర్తి సంతృప్తి, హర్షం వ్యక్తమవుతోందని ఎంపీ భరత్ తెలిపారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో గృహసారథులు, కన్వీనర్లు ప్రతీ ఇంటికి వెళ్లి కనీసం 5 నిమిషాలు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. జగన్ పాలనపైనా, సంక్షేమ పథకాలు అమలుపైనా అయిదు ప్రశ్నలు అడిగి, రికార్డు చేసుకుంటారని చెప్పారు. గృహ యజమానుల అనుమతితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో కూడిన స్టిక్కర్ ఇంటి తలుపునకు అంటించడం, మొబైల్ కు స్టిక్కర్, అలాగే ఫోన్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని వివరించారు ఎంపీ మార్గాని భరత్ రామ్‌.