Site icon NTV Telugu

Kesineni vs Devineni: దేవినేని ఉమకు కేశినేని నాని ఝలక్‌.. టికెట్‌ ఇస్తే అంతే..!

Kesineni Vs Devineni

Kesineni Vs Devineni

Kesineni vs Devineni: బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. తనకు నచ్చని వారికి టికెట్‌ ఇస్తే అంతే.. సహకరించేది లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.. ఇక, ఇవాళ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలోనూ అదే వైఖరి ప్రకటించారు.. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని… దేవినేని ఉమకు ఝలక్‌ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేవినేనికి టికెట్‌ ఇస్తే సహకరించనని పరోక్షంగా తేల్చేశారు.. దేవినేని ఉమకు వ్యతిరేక వర్గంగా ఉన్న బొమ్మసానికి తన మద్దతు అని ప్రకటించారు బెజవాడ ఎంపీ.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

కొంత మంది ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు రాజభోగాలు అనుభవిస్తున్నారు అంటూ మాజీ మంత్రి దేవినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని.. అయితే, బొమ్మసాని కుటుంబం 70 ఏళ్ల నుంచి ప్రజా సేవలో ఉందని గుర్తుచేసిన ఆయన.. బొమ్మసానికే నా మద్దతు… బొమ్మసాని మరిన్ని పెద్ద పదవుల్లోకి వెళ్లాలంటూ తన మనసులోని మాటలను బయటపెట్టారు.. బొమ్మసాని లాంటి వారే ప్రజా స్వామ్యంలో ఉండాలని.. పదవుల కోసం, రాజుల్లా ఫీలయ్యే వారు మనకి వద్దు అంటూ తేల్చేశారు.. బొమ్మసాని లాంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లాలి.. ఇటువంటి వ్యక్తులను మనం గెలిపించాలి.. చట్టసభలకు పంపించాలంటూ ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కాగా, తన సోదరుడు కేశినేని చిన్ని.. ఇవాళ దేవినేని ఉమతో కలసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. ఇదే సమయంలో.. ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

మరోవైపు.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కేశినేని నాని ఆసక్తికర పరిణామాలు చోటుకున్నాయి.. బోండా ఉమ వ్యతిరేక వర్గీయుడు గోగుల రమణ నేతృత్వంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కేశినేని నాని పాల్గొన్నారు.. కేశినేని నాని సమక్షంలో బోండా ఉమపై గోగుల రమణ పరోక్ష వ్యాఖ్యలు. డెప్యూటీ మేయరుగా గోగుల రమణ నిజాయితీగా పని చేశారు. గోగుల రమణని దింపాలని ఎన్నో కుట్రలు చేసినా అవి పారలేదు.. ఐదేళ్లు ఉన్నా.. ఒక్క అవినీతి మచ్చ లేదు. నేటి కార్పొరేటర్లు ఎంత దోచుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లో ఉండాలే తప్ప.. దోచుకోవడానికి రావద్దు. చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని‌ చేసే వ్యక్తి, వాస్తవాలు ఆలోచించండి.. చంద్రబాబును గెలిపించండి అంటూ కేశినేని నాని పిలుపునిచ్చారు..

ఇక, మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ మాట్లాడుతూ.. కేశినేని నాని మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని ప్రశంసలు కురిపించారు.. కొంతమంది మాటలు చెప్పి మాయ చేస్తారు. సాయం కోరి వెళ్తే హీనంగా‌ చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ నాని మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. కేశినేని నాని విజయవాడకు రెండు ఫ్లైఓవర్లు తెచ్చారు. నాని చంద్రబాబుతో నేరుగా ఏ విషయమైనా చర్చిస్తారని తెలిపారు.. మనందరి సహాయ సహకారాలుంటే నానినే మన ఎంపీ అంటూ పేర్కొన్నారు గోగుల రమణ.. అయితే, మొత్తంగా సీనియర్లనే కేశినేని నాని టార్గెట్‌ చేశారా? అనే చర్చ సాగుతోంది.

Exit mobile version