ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు చూస్తుంటే వైసీపీ పతనం మొదలైందని అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసీపీ నేతలు కొందరు గైర్హాజరయ్యారు. ఇంకొందరు రోడ్లపై ఆందోళనలు చేపట్టారు. మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా చేస్తే.. మాజీ మంత్రులు అందరూ అలక బునారు. మంత్రి వర్గ ఏర్పాటులో సీఎం జగన్ పాటించిన విధానమేంటీ..? మంత్రులను తొలగించడంలో సలహాదారుడికి అధికారమెక్కడుంది..?అని జీవీఎల్ ప్రశ్నించారు.
ప్రధాన సలహాదారుది రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు. సజ్జల వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిని మంత్రి పదవుల నుంచి తొలగిస్తే వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? కమ్మ, వైశ్య, క్షత్రియ కులాలకు చెందిన కొడాలి నాని, వెల్లంపల్లి, శ్రీరంగనాధరాజులను సామాజికంగా అణగదొక్కారని మా అభిప్రాయం. నిజమైన సాధికారత అంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం.. ఆ దమ్ము సీఎం జగనుకుందా..?అన్నారు జీవీఎల్.
