NTV Telugu Site icon

MP Guru Murthy: తిరుపతి రైల్వేస్టేషన్ కొత్త డిజైన్‌లపై అభ్యంతరాలు

Mp Gurumurthy

Mp Gurumurthy

తిరుపతి రైల్వే స్టేష‌న్‌ను వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా మార్చే దిశ‌గా కేంద్ర ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్‌కు సంబంధించిన డిజైన్లు పూర్తి కాగా ఆయా నిర్మాణాల‌కు సంబంధించి టెండ‌ర్లు కూడా పూర్తి అయ్యాయి. త్వర‌లోనే ప‌నుల‌ను మొద‌లుపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగ‌ళ‌వారం ప్రకటించారు. అయితే తిరుప‌తి వ‌రల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌కు సంబంధించిన డిజైన్‌లపై తిరుప‌తి వాసులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేర‌కు వారు స్థానిక ఎంపీ మ‌ద్దిల గురుమూర్తికి త‌మ అభ్యంతరాల‌ను వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విన వైష్ణవ్‌ ప్రక‌ట‌న‌పై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుప‌తి రైల్వే స్టేషన్ నూత‌న డిజైన్లపై తిరుప‌తి వాసుల అభ్యంత‌రాల‌ను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని గురుమూర్తి ట్విట్టర్ వేదిక‌గా తెలిపారు. భారతీయ వాస్తు శాస్త్రం ప్రతిబింబించేలా తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.299 కోట్లతో ప్రపంచ స్థాయి తరహాలో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనుందని.. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చిరకాల కల అని అది ఇన్నాళ్లకు నెరవేరనుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.