Site icon NTV Telugu

అన్ని శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాం: వెల్లంపల్లి

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ ఉండటంతో ఏర్పాట్లను మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ నివాస్, ఇంద్రకీలాద్రి దేవాలయ ఛైర్మన్, ఈవోలతో కలిసి పరిశీలించారు.

దీక్షల విరమణ, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల, దర్శనం, ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం వంటి ఏర్పాట్లపై ఆరా తీసిన మంత్రి వెలంపల్లి. వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. రోజుకు 2 లక్షల లడ్డూల పంపిణీకి సమాయత్తం అవుతున్నామన్న అధికారులు తెలిపారు. అన్న ప్రసాదాన్ని ప్యాకెట్ల ద్వారా అందిస్తున్నామని ఈవో వెల్లడించారు. భక్తులకు పులిహోర, పెరుగన్నం అందించాలని మంత్రి వెలంపల్లి ఆదేశాలు జారీ చేశారు.

ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా దేవాదాయ శాఖ సమన్వయం చేసుకుంటోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మిగిలిన శాఖలు కూడా వారి వారి బడ్జెట్టును ఈవోకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి శాఖల నుంచి సమన్వయం కోసం ఓ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్టు చెప్పారు. ఇరుముడులు, క్యూలైన్లు, కేశ ఖండన శాలల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మొదలుకుని ప్రసాదం పంపిణీ వరకు అన్ని రకాల ఏర్పాట్లను భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version