Site icon NTV Telugu

Minister Suresh: అప్పుడు అలా బొక్కబోర్లా.. ఇప్పుడు దత్తపుత్రుడి సహకారం

Adimulapu Suresh

Adimulapu Suresh

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మరోసారి విపక్ష టీడీపీపై ధ్వజమెత్తారు. జగన్‌ని ఒంటరిగా ఎదుర్కోలేకే చంద్రబాబు దత్తపుత్రుడ్ని (పవన్ కళ్యాణ్) తీసుకొస్తున్నాడని విమర్శించారు. 2009లో వైఎస్‌ని ఎదుర్కోవడానికి మహాకూటమి పేరుతో అన్ని పార్టీలు ఏకమై బొక్కబోర్లాపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్‌ని కదిలించలేరని చెప్పారు.

సీఎం జగన్ ఎవరికీ అందనంత ఎత్తులో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని, రాజశేఖరరెడ్డి కన్నా రాజకీయ చతురతలో నాలుగు అడుగులు ముందున్న జగన్‌ని ఎవరూ ఎదుర్కోలేరన్నారు. జగన్ మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని నమ్మకంగా చెప్పిన మంత్రి సురేష్.. తనకు రెండోసారి మంత్రి పదవి దక్కిందంటే, అది జగనన్న పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడిందని, వైసీపీ కార్యకర్తలు మాత్రం అవినీతి రహితంగా ప్రజలకు సేవ చేస్తున్నారని వెల్లడించారు.

అటు.. బాపట్ల జిల్లా రేపల్లెలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సైతం పది కాలాల పాటు జగనే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ పరిపాలనతో తాము సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన వారిని కలుస్తున్నామన్న ఆయన.. అమ్మబడి , చేయూత, విద్యా దీవెన ,రైతు భరోసా, మత్స్యకార భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదని మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

Exit mobile version