NTV Telugu Site icon

Minister Roja: బాలయ్యకు వయసు పెరిగినా మాట్లాడే తీరు మారడం లేదు

Minister Roja

Minister Roja

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు. అటు లోకేష్ దశ దిశా లేకుండా పాదయాత్ర అంటున్నాడని.. ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్లు పాదయాత్రలో ఏం చెప్తారని మంత్రి రోజా ప్రశ్నించారు. జగన్‌ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఆరోపించారు. లోకేష్ ఎంత తిడితే జగన్‌కు అంత ఆశీర్వాదం లభిస్తుందని మంత్రి రోజా అన్నారు.

Read Also: Pathaan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)

ప్రజా సమస్యలపై పోరాటం చేసి జగన్ పాదయాత్ర చేశారని మంత్రి రోజా గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారన్నారు. లోకేష్ వార్డు మెంబర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఆయన పాదయాత్ర చేయడం వల్ల తమకు నష్టమేమీ లేదన్నారు. పోటీ చేసి మొదటిసారి ఓడిపోయిన వ్యక్తిని, పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తుల్ని చూసి వైసీపీ కార్యకర్తలు భయపడరని చురకలు అంటించారు. జనసేన రాజకీయ పార్టీనా, కన్ఫ్యూజన్ పార్టీనా అర్ధం కావడం లేదన్నారు. జిల్లా అధ్యక్షులను కూడా పెట్టుకోలేని జనసేన పార్టీని చూసి ఇక్కడ భయపడేవాళ్లు లేరన్నారు. టీడీపీ హయాంలోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. ఆనాడు సీఎంగా చంద్రబాబు, పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారని మంత్రి రోజా అన్నారు. తిరుపతి జిల్లాలో కోలీవుడ్‌కు భూములు కేటాయిస్తే స్వాగతిస్తామని.. టూరిజం అభివృద్ధి జరుగుతుందని రోజా అభిప్రాయపడ్డారు.