Site icon NTV Telugu

RK Roja: కళాకారులను దూషించేవాళ్లు జీవితంలో బాగుపడరు..!!

Minister Roja Rajamundry

Minister Roja Rajamundry

RK Roja: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్‌లలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గుంటూరులో ఇప్పటికే ఉత్సవాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గడచిన 1000 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజల్లుతున్నాయని అన్నారు. భాష, వేషం, నటనకు సంబంధించి గోదావరి జిల్లాల కళాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మంత్రి రోజా చెప్పారు. కళామతల్లి ముద్దుబిడ్డలు గోదావరి జిల్లాల కళాకారులే అని అభిప్రాయపడ్డారు. కళాకారులను దూషించే వారు జీవితంలో బాగుపడరని హెచ్చరించారు.

Read Also: వామ్మో.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇంతమంది కొట్టారా?

మరోవైపు తనపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. తాను 12 ఏళ్ల నుంచి నగరిలోనే ఉన్నానని.. అందుకే తనను నగరి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కానీ పాయకరావుపేట ప్రజలు, కొవ్వూరు ప్రజలు అనితను చీత్కరించుకుని ఎన్నికల్లో తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసి ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారని మంత్రి రోజా వివరించారు. మన సంస్కృతి, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత, మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తమ కళలను కళాకారులు ప్రదర్శించేందుకు చక్కని వేదిక జగనన్న సంస్కృతిక సంబరాల వేదిక అని తెలిపారు. మహిళా సాధికారత దిశగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో తోడ్పడుతున్నారని.. కళాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

Exit mobile version