NTV Telugu Site icon

PeddiReddy: ఏపీలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రానివ్వకూడదు

Peddireddy

Peddireddy

Minister PeddiReddy Ramachandra Reddy: ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇంధన, గనులు, ఎపిఎండిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఇడిసిఎపి రూపొందించిన హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతులు చేసుకుంటున్నామన్నారు.

ఏపీఎండీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గురంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీఎండీసీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకవైపు బొగ్గు ఉత్పత్తిపై ఏపీఎండీసీ దృష్టి సారించాలని, అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని, ఇంధన, గనులశాఖ అధికారులు దీనిపై సంయుక్తంగా ముందుకు సాగాలని సూచించారు.

Read Also: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే..?

ఇంధనశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని, హేతుబద్ధంగా అవసరమైన పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖలో కూడా పునర్ వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్ లను ఇవ్వడంలో ఎటువంటి అలసత్వంను సహించేంది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్‌లను జారీ చేసే విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. అలాగే వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయాలని సూచించారు. మీటర్ల వల్ల రైతులపై ఎటువంటి భారం పడదని, కావాలని విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వ్యవసాయానికి నికరంగా ఎంత విద్యుత్ వాడుతున్నారో మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల తెలుస్తుందన్నారు. ఉచితంగా క్వాలిటీ విద్యుత్‌ను వ్యవసాయానికి అందించడానికి మరింత వీలవుతుందన్నారు. ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. లీగల్ విభాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ కేసులను పరిష్కరం కోసం కృషి చేయాలని కోరారు.

Show comments